బంగ్లాదేశ్‌లో జరిగిన 13వ జాతీయ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (Bangladesh Jatiya Party – BJP) ఒక స్థానంలో విజయం సాధించింది. ఆ దేశంలో ఈ పార్టీని క్లుప్తంగా ‘బీజేపీ’ అని పిలుస్తారు. ఈ పార్టీ అధ్యక్షుడు అందలీవ్ రెహ్మాన్ పార్థో (Andaleeve Rahman Partho) భోలా-1 (Bhola-1) నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. గత 15 ఏళ్ల షేక్ హసీనా పాలన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఫలితం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఎన్నికల్లో అందలీవ్ రెహ్మాన్ పార్థోకు 1,05,543 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి, జమాతే ఇ ఇస్లామీకి చెందిన నజ్రుల్ ఇస్లాంపై 30,226 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ‘బంగ్లాదేశ్ బీజేపీ’ పార్టీ మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కి మిత్రపక్షంగా ఉంది. పార్థో స్వయంగా బారిస్టర్ కావడమే కాకుండా, ఆ దేశంలో ప్రముఖ విద్యావేత్తగా మరియు రాజకీయ నాయకుడిగా మంచి గుర్తింపు పొందారు.
మొత్తం 297 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో బిఎన్‌పి (BNP) మరియు దాని మిత్రపక్షాలు 212 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేశాయి. ఇందులో బిఎన్‌పి ఒంటరిగానే 209 సీట్లు సాధించగా, మిత్రపక్షాలైన గనోసంహతి ఆందోళన్, బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (బీజేపీ), మరియు గోనో ఓధికార్ పరిషత్ తలా ఒక సీటును గెలుచుకున్నాయి. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ప్రధాన పోరు బిఎన్‌పి మరియు జమాత్-ఏ-ఇస్లామీ మధ్యే సాగింది.