మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము రాజకీయ పార్టీగా మారబోతున్నామని ప్రకటించగానే బీఆర్ఎస్ శ్రేణులు తమను ట్రోలింగ్ చేశాయని, అయితే ప్రస్తుత ఫలితాలు వారికి ఒక గుణపాఠమని ఆమె అన్నారు. “ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది” అని హెచ్చరించిన ఆమె, ఇప్పటికైనా బీఆర్ఎస్ తన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. గతంలో 90 శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్, ఇప్పుడు కేవలం 16 స్థానాలకే పరిమితం కావడంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు ఆ పార్టీకి ఓటు వేశారని, ఆ రాజకీయ లోటును భవిష్యత్తులో తెలంగాణ జాగృతి భర్తీ చేస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పరోక్షంగా పనిచేసిందని, ఇది ఆ రెండు పార్టీల పొత్తుకు తొలి మెట్టు అని ఆమె ఆరోపించారు. కొత్తగూడెంలో సీపీఐకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడాన్ని ఆమె విడ్డూరంగా అభివర్ణించారు. అలాగే, బీజేపీ నేత బండి సంజయ్ కరీంనగర్లో గెలవడానికి భారీగా ఖర్చు చేశారని విమర్శిస్తూ, 17 స్థానాలు రావడంపై కేటీఆర్ గొప్పగా మాట్లాడుకోవడం విచిత్రమని ఎద్దేవా చేశారు.
తెలంగాణ జాగృతి మరియు ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ (AIFB) పొత్తు మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలను సాధించిందని కవిత వెల్లడించారు. తాము కేవలం 40 వార్డుల్లో విజయం సాధించామని, ముఖ్యంగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అధికారికంగా 33 స్థానాల్లో తమ అభ్యర్థులు గెలవగా, మరో 7 చోట్ల స్వతంత్రులుగా విజయం సాధించారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ, ఆయన రాజకీయాలపై కాకుండా ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కవిత సూచించారు.