తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 16తో ముగియనుండటంతో, ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీ నుండి నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ. 9,000 కోట్ల నిధులను సమకూర్చుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ నిధుల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 69.40 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ. 6,000 చొప్పున సాయం అందనుంది. పథకంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈసారి వినూత్నంగా శాటిలైట్ సర్వేను నిర్వహించింది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగుకు పనికిరాని కొండలు, గుట్టలను జాబితా నుండి తొలగించి, కేవలం వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే సాయం అందేలా చర్యలు తీసుకుంది. నిధుల పంపిణీ ప్రక్రియ తక్కువ విస్తీర్ణం ఉన్న చిన్న, సన్నకారు రైతుల నుండి ప్రారంభమై వారం రోజుల్లో అందరికీ పూర్తి కానుంది.
మరోవైపు, రైతు భరోసా పంపిణీ ముగిసిన వెంటనే రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో, పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల చివరలో లేదా మార్చి మొదటి వారంలో విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న ఈ సమయంలో పెట్టుబడి సాయం అందనుండటంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.