ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిబ్బందికి కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో భారీ ఊరటనిచ్చింది. గతంలో నిలిచిపోయిన ‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ (GPA) స్కీమ్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఈ పథకం కింద కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు అందరికీ ఉచిత బీమా వర్తిస్తుంది. హోదాను బట్టి రూ. 20 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజీని ప్రభుత్వం కల్పించనుంది. అలాగే పోలీసులకు రావాల్సిన టీఏ (TA), డీఏ (DA) బకాయిలు మరియు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ల కోసం రూ. 500 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు.
పోలీస్ శాఖ ఆధునికీకరణలో భాగంగా కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులకు త్వరలోనే 3,000 కొత్త వాహనాలను అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా, మహిళల భద్రత కోసం ‘శక్తి యాప్’ పేరుతో కొత్త మొబైల్ అప్లికేషన్‌ను తీసుకువస్తున్నట్లు మంత్రి తన ప్రసంగంలో వివరించారు.
పోలీసుల శిక్షణ మరియు నియామకాలపై కూడా బడ్జెట్‌లో స్పష్టత ఇచ్చారు. కొత్త పోలీస్ అకాడమీ నిర్మాణం కోసం 94 ఎకరాలను కేటాయించి, ప్రాథమికంగా రూ. 15 కోట్లు కేటాయించారు. కొత్తగా ఎంపికైన 5,757 మంది కానిస్టేబుల్ ట్రైనీలకు స్టైఫండ్‌ను రూ. 4,500 నుంచి రూ. 12,000కు పెంచడం విశేషం. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ‘ఈగల్ టీమ్’ను రంగంలోకి దించామని, చిత్తూరు, రాజమండ్రి సహా నాలుగు జిల్లాల్లో కొత్తగా ఏపీఎస్పీ (APSP) బెటాలియన్లను ప్రారంభించి 3,920 పోస్టులను మంజూరు చేశామని ప్రభుత్వం ప్రకటించింది.