కథానాయికగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, శ్రీలీల తన చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా విజయవంతంగా ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేశారు. బుధవారం (ఫిబ్రవరి 11) జరిగిన కాన్వకేషన్ వేడుకలో ఆమె తన డిగ్రీ పట్టాను అందుకున్నారు. శ్రీలీల తల్లి స్వర్ణలత కూడా వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో, అమ్మ చూపిన బాటలోనే నడుస్తూ ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. సినిమాల్లో గ్లామర్ ఒలికించినా, నిజ జీవితంలో మాత్రం ఎంతో క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
గతంలో సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ షూటింగ్ చేస్తున్న సమయంలోనే ఆమె తన ఫైనల్ ఇయర్ పరీక్షలు రాశారు. ఒకవైపు నైట్ షూటింగ్స్, మరోవైపు ఎగ్జామ్ ప్రిపరేషన్‌తో ఎంతో కష్టపడి ఇప్పుడు డాక్టర్ పట్టా పుచ్చుకున్నారు. నాలుగేళ్ల కోర్సుతో పాటు, రెండేళ్ల పాటు నిర్వహించే క్లినికల్ ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ గౌనులో శ్రీలీల పట్టా అందుకుంటున్న ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సినిమాల విషయానికి వస్తే, శ్రీలీల చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఆమె నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ ఏడాది మార్చి 26న విడుదల కాబోతోంది. అలాగే సంక్రాంతికి తమిళంలో శివకార్తికేయన్ సరసన నటించిన ‘పరాశక్తి’ కూడా మంచి గుర్తింపు తెచ్చింది. ఇక నుంచి సినిమాలతో అలరిస్తూనే, అవసరమైనప్పుడు డాక్టర్‌గా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పకనే చెబుతున్నారు.