గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట: కూటమి, వైసీపీలపై వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు!

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ చేసిన ప్రసంగం కేవలం అవాస్తవాలు, కల్పితాలతో నిండిన ఒక “డొల్ల పత్రం” అని వైఎస్ షర్మిల విమర్శించారు. కూటమి ప్రభుత్వం తన 19 నెలల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే గవర్నర్‌తో పచ్చి అబద్ధాలు చెప్పించిందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోకు కొంచెం మెరుగులు దిద్ది చదివినట్లుగా ఉందని, రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి ఎటువంటి స్పష్టమైన దిశానిర్దేశం లేదని ఆమె ఎద్దేవా చేశారు. అసలు సుపరిపాలన అనేది రాష్ట్రంలో మచ్చుకైనా కనిపించడం లేదని దుయ్యబట్టారు.

ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ‘సూపర్ సిక్స్’ హామీలు వాస్తవానికి “సూపర్ ఫ్లాప్” అయ్యాయని షర్మిల విమర్శించారు. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల విషయంలో లక్షలాది మంది లబ్ధిదారులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. మెగా డీఎస్సీని “దగా డీఎస్సీ”గా మార్చారని, జాబ్ క్యాలెండర్ ఊసే లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారని, ఆరోగ్యశ్రీని యూనివర్సల్ హెల్త్ పాలసీ పేరుతో చంపేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వైఖరిని కూడా షర్మిల తప్పుబట్టారు. మైకు ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాననడం బాధ్యతారాహిత్యమని, ప్రజలు ఓట్లేసింది సభకు వెళ్లి పోరాడటానికే తప్ప మారం చేయడానికి కాదని హితవు పలికారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ వేదికగా నిలదీసే దమ్ము, ధైర్యం లేకపోతే జగన్ తన ఎమ్మెల్యేలతో సహా వెంటనే రాజీనామా చేయాలని ఆమె సవాల్ విసిరారు. ప్రజల ఎజెండాను పక్కనపెట్టి కేవలం సొంత ఎజెండా కోసం పాకులాడటం సరికాదని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *