మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో బెయిల్ లభించిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో బుధవారం సాయంత్రం ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కాకముందే పోలీసులు మరో అడుగు వేశారు. 2023 నాటి సత్తెనపల్లి సంక్రాంతి లక్కీ డ్రా కేసులో ఆయనపై పీటీ (Prisoner on Transit) వారెంట్‌ను సత్తెనపల్లి పోలీసులు గుంటూరు సబ్ కోర్టులో దాఖలు చేశారు. దీంతో ఆయన విడుదల నిలిచిపోయి, జైలు జీవితం మరికొంత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ఈ తాజా కేసు నేపథ్యం చూస్తే.. 2023లో సత్తెనపల్లిలో వైఎస్సార్ సంక్రాంతి సంబరాల పేరుతో అంబటి రాంబాబు భారీ ఎత్తున లక్కీ డ్రా నిర్వహించారు. వంద రూపాయల టికెట్ పెట్టి కార్లు, బైకులు బహుమతులుగా ప్రకటిస్తూ కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఎటువంటి అనుమతులు లేకుండా, సచివాలయ వలంటీర్ల ద్వారా బలవంతంగా టికెట్లు అమ్ముతూ అవినీతికి పాల్పడ్డారని జనసేన నేత గాదె వెంకటేశ్వర రావు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నమోదైన ఈ పాత కేసును పోలీసులు ఇప్పుడు విచారణ నిమిత్తం తెరపైకి తెచ్చారు.
వరుసగా రెండు కేసుల్లో బెయిల్ రావడంతో అంబటి రాంబాబు గురువారం ఇంటికి వస్తారని ఆశించిన కుటుంబ సభ్యులకు, వైసీపీ శ్రేణులకు ఈ పరిణామం పెద్ద షాక్ ఇచ్చింది. అంబటిని గురువారం కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించడంతో, పోలీసులు ఆయన్ను మళ్ళీ తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసులో అరెస్టు చూపించే వ్యూహంతో పోలీసులు ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు ప్రభుత్వంపై మండిపడుతూ, ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపిస్తున్నారు.