ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కీలక భేటీ నిర్వహించారు. దేశ వ్యవసాయ జీడీపీలో ఏపీ వాటా ప్రస్తుతం 9.9 శాతంగా ఉందని, దీనిని మరింత వృద్ధి చేసేందుకు కేంద్రం మార్గనిర్దేశం చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి, ఏపీ అవసరాలకు అనుగుణంగా తక్షణమే ఒక సమగ్ర ‘యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేయాలని తన శాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఉద్యానవన పంటల అభివృద్ధికి (Horticulture) పెద్దపీట వేస్తున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా కొబ్బరి సాగు అభివృద్ధి కోసం రూ. 200 కోట్ల సాయం, కొబ్బరి ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటు, కర్ణాటక తరహాలో ఆధునిక టెండర్ కోకోనట్ మార్కెట్ల స్థాపనపై ఆయన చర్చించారు. వీటితో పాటు, కొల్లేరు సరస్సు ప్రాంతంలోని 50 వేల ఎకరాల్లో ‘మఖానా’ సాగుకు ఉన్న అవకాశాలను వివరించి, ఏపీలో ప్రత్యేకంగా మఖానా డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.
పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 695 కోట్ల నిధుల విడుదల, తోతాపూరి మామిడి రైతులకు ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ కింద రూ. 100 కోట్ల సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సేంద్రీయ సాగులో ఏపీ సాధించిన ప్రగతిని కేంద్రమంత్రి ప్రశంసిస్తూ, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించినందుకు గానూ ‘PM-PRANAM’ పథకం కింద రాష్ట్రానికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు విజన్ కారణంగా ఏపీ త్వరలోనే దేశానికి హార్టికల్చర్ హబ్‌గా మారుతుందని శివరాజ్ సింగ్ కొనియాడారు.