తేది:09-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈనెల 09 నుండి 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ తో కలిసి వారోత్సవాలకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరపు ప్రధాన అంశం “కేవైసీ (KYC) సురక్షిత బ్యాంకింగ్‌కు తొలి అడుగు” అనే విషయంపై కేంద్రీకృతమై ఉందని అన్నారు .
ప్రజలలో సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులపై అవగాహన పెంపొందించడం, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేవైసీ వివరాలను నవీకరించుకోవడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, సైబర్ భద్రతపై జాగ్రత్తలు పాటించడం మరియు ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం ఈ వారోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పారు.
ప్రతి పౌరుడు తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేవైసీ వివరాలను వెంటనే నవీకరించుకోవాలని జిల్లా కలెక్టర్ గారు కోరారు. కేవైసీ నవీకరణ ద్వారా బ్యాంకింగ్ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉండటమే కాకుండా, ఖాతాల దుర్వినియోగాన్ని నివారించవచ్చు మరియు లావాదేవీలు మరింత సురక్షితంగా ఉంటాయి. ప్రజలు తమ ఓటీపీలు, పిన్ నంబర్లు, పాస్వర్డులు వంటి గోప్యమైన బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరికీ పంచుకోకూడదని, ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించాలని సూచించారు.
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా గ్రామ సభలు, అవగాహన కార్యక్రమాలు, వినియోగదారుల సమావేశాలు మరియు ఆర్థిక విద్యా శిబిరాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నిర్వహించడానికి ప్రణాళికను సిద్దం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా సురక్షిత డిజిటల్ బ్యాంకింగ్, పొదుపు అలవాట్లు, బాధ్యతాయుత ఆర్థిక ప్రణాళిక మరియు ప్రభుత్వ ఆర్థిక పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించబడుతుంది.
ప్రజలందరూ ఈ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, కేవైసీ వివరాలను నవీకరించుకొని, సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులను అనుసరించాలని కోరారు. ఆర్థిక అవగాహన ప్రతి కుటుంబం మరియు సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఎఫ్ఎల్సీ కోట మధుసూదన్, సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్లు రమేష్, వెంకటేష్, నాగేంద్ర ప్రసాద్, వనజ, యమున, విజయ్ తదితరులు పాల్గొన్నారు