పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్ జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఒక వింత భయం ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రివేళ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తలుపులు తడుతున్నారని, తీరా తెరిచి చూస్తే ముసుగులు ధరించిన దుండగులు ఇళ్లలోకి చొరబడుతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ప్రచారంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు రాత్రంతా నిద్రపోకుండా చేతిలో కర్రలు, కత్తులు పట్టుకుని వీధుల్లో గస్తీ కాస్తున్నారు.
ఆధార్ కార్డుల దహనం.. వింత ప్రచారం
ఈ పుకార్లలో ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏమిటంటే.. దుండగులు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ముందుగా అక్కడి వారి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులను తగులబెట్టేస్తున్నారని, ఆ తర్వాతే బంగారం, నగదు దోచుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాణిక్‌పారా, సంక్రైల్, గోపివల్లభ్‌పూర్ వంటి గ్రామాల్లో ఈ వార్తలు కార్చిచ్చులా వ్యాపించాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇలాంటి భయాందోళనలు నెలకునడం గమనార్హం.
పిల్లల చదువులపై ప్రభావం
ఈ సోషల్ మీడియా వదంతుల వల్ల పిల్లలు మానసిక స్థిరత్వం కోల్పోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షల సమయం దగ్గరపడుతుండటంతో, రాత్రిపూట వినిపిస్తున్న ఈ వింత శబ్దాలు, దోపిడీల వార్తల వల్ల విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ‘దెయ్యాలు తిరుగుతున్నాయన్న’ పుకార్ల వల్ల హాస్టల్ విద్యార్థులు ఖాళీ చేసి వెళ్లిపోయిన సంఘటనలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
పోలీసుల వివరణ: ఇవన్నీ ఒట్టి వదంతులే!
ఈ పరిస్థితిపై ఝార్‌గ్రామ్ పోలీస్ అధికారులు స్పందిస్తూ.. ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడా ఇటువంటి దోపిడీలు జరిగినట్లు కానీ, పత్రాలు తగులబెట్టినట్లు కానీ ఎటువంటి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, రాత్రిపూట పెట్రోలింగ్‌ను మరింత ఉధృతం చేస్తున్నామని పోలీసులు భరోసా కల్పించారు.