నటుడు అర్జున్ సర్జా (Arjun Sarja) తన తాజా చిత్రం ‘సీతా పయనం’ ప్రమోషన్స్‌లో భాగంగా తన వ్యక్తిగత జీవితం మరియు కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె ఐశ్వర్యను కథానాయికగా పరిచయం చేస్తూ ఆయనే దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న (వాలంటైన్స్ డే) విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అర్జున్ మాట్లాడుతూ, తన చుట్టూ ఉన్నవారే తనను ఆర్థికంగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న వయసులోనే స్టార్‌డమ్ రావడంతో పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చిందని, అయితే ఆ డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియక తప్పులు చేశానని అర్జున్ వెల్లడించారు. “నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేశారు, అందుకే నేను చాలా ప్రాపర్టీస్ కోల్పోయాను. ఆ ఆస్తులు కనుక ఇప్పుడు నా దగ్గర ఉంటే నా స్థాయి మరోలా ఉండేది” అని ఆయన పేర్కొన్నారు. తాను తెలుగులో చేసిన మొదటి సినిమాకు కేవలం పాతిక వేల రూపాయల పారితోషికం అందుకున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు.
దివంగత నటుడు శోభన్ బాబు గారితో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా అర్జున్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. శోభన్ బాబు తనకు అత్యంత ఆప్తుడని, ఆర్థిక విషయాల్లో ఆయన ఎన్నో అమూల్యమైన సలహాలు ఇచ్చేవారని తెలిపారు. “ఆయన (శోభన్ బాబు) రియల్ ఎస్టేట్ మరియు ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి చెప్పిన విషయాలు అప్పట్లో నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆయన మాట విని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది” అని అర్జున్ నిజాయితీగా అంగీకరించారు.