డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత్ పట్ల తన దౌత్య వైఖరిని పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల భారత్, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో, ట్రంప్ యంత్రాంగం విడుదల చేసిన కొత్త ఇండియా మ్యాప్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ మ్యాప్‌లో వివాదాస్పద ప్రాంతాలైన పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) మరియు చైనా వాదించే ఆక్సాయ్ చిన్‌లను కూడా భారతదేశ అంతర్భాగంగా చూపడం విశేషం.
గతంలో అమెరికా విడుదల చేసే మ్యాప్‌లలో పీఓకేను వివాదాస్పద ప్రాంతంగా లేదా పాక్ వాదనలకు అనుగుణంగా చూపించేవారు. కానీ, తాజా మ్యాప్ ద్వారా అమెరికా పాకిస్థాన్‌కు గట్టి దౌత్య సంకేతాలను పంపింది. ముఖ్యంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత ప్రాదేశిక సార్వభౌమత్వానికి అమెరికా ఆమోదం అవసరం లేనప్పటికీ, ఒక సూపర్ పవర్ ఇలాంటి మ్యాప్‌ను అధికారికంగా విడుదల చేయడం భారత్ సాధించిన గొప్ప దౌత్య విజయంగా నిపుణులు భావిస్తున్నారు.
అంతేకాకుండా, ఈ మ్యాప్‌లో లడఖ్‌లోని ఆక్సాయ్ చిన్‌ను కూడా భారత్‌లో చేర్చడం ద్వారా చైనాకు కూడా ట్రంప్ సర్కారు షాక్ ఇచ్చింది. భారత్‌పై గతంలో విధించిన 50 శాతం ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్, అదే సమయంలో సరిహద్దుల విషయంలోనూ భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించినట్లయింది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వరుస అమెరికా పర్యటనల ద్వారా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో, అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.