ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన పాలనా దక్షతను, మానవత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక చిన్న వీడియోకు ఆయన తక్షణమే స్పందించారు. “పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి” అంటూ బురద రోడ్డులో నడుస్తూ విద్యార్థులు చేసిన విన్నపం డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లడంతో, ఆయన జెట్ స్పీడ్‌తో నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థుల కష్టాలను చూసి చలించిన పవన్ కళ్యాణ్, వెంటనే అధికారులను ఆదేశించి నివేదిక కోరారు. ఆయన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన కదిలింది. గజ్జలవారిపల్లి నుంచి స్కూలుకు వెళ్లే 1.6 కిలోమీటర్ల మేర ఉన్న రహదారి నిర్మాణానికి రూ. 86 లక్షల నిధులను కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా నెలల తరబడి పట్టే ఈ ప్రక్రియ, పవన్ కళ్యాణ్ చొరవతో ఒక్కరోజులోనే పూర్తి కావడం విశేషం.
ఈ రోడ్డు నిర్మాణం వల్ల విద్యార్థులకే కాకుండా, పొలాలకు వెళ్లే రైతులకు కూడా దశాబ్దాల నాటి రవాణా కష్టాలు తీరనున్నాయి. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యర్థనను మన్నించి వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్‌కు గజ్జలవారిపల్లి విద్యార్థులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.