తెలంగాణ జిల్లాల్లో పెద్దపులి కలకలం: పశువులపై దాడులతో జనం బెంబేలు

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా పెద్దపులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో వారం రోజుల పాటు అలజడి సృష్టించిన పులి ఎట్టకేలకు చిక్కగా, ఇప్పుడు తెలంగాణలోని యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, జనగామ జిల్లాల్లో మరో పులి సంచరిస్తోంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ పులి, దట్టమైన అడవి దొరకక జనావాసాల వైపు వస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. గడచిన 50 ఏళ్లలో ఈ ప్రాంతాల్లో పులి జాడ లేకపోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

తాజా సమాచారం ప్రకారం, జనగామ జిల్లా నర్మేట మండలం అమ్మాపూర్ గ్రామంలో పులి రెండు ఆవు దూడలను చంపేసింది. అలాగే సిద్ధిపేట జిల్లా దూల్మిట్ట, మద్దూర్ మండలాల్లోని కూటిగల్, భైరన్‌పల్లి, లధ్నూర్ గ్రామాల్లోనూ లేగ దూడలు, గొర్రెలను పొట్టనబెట్టుకుంది. పులి పాదముద్రల (Pugmarks) ఆధారంగా అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ పులి సిద్ధిపేట జిల్లా వైపు వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పులి ఆచూకీ కోసం ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి, పర్యవేక్షణను తీవ్రతరం చేశారు.

పులి సంచరిస్తున్న జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఒంటరిగా బయటకు రావొద్దని, పొలాల వద్దకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని సూచించారు. కొలనుపాక, లింగాల ఘనపురం, రఘునాథపల్లి వంటి పరిసర ప్రాంతాల్లో పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని డప్పు చాటింపు వేయించారు. పులిని పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎవరూ భయపడవద్దని అధికారులు భరోసా ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *