లడ్డూ ప్రసాదంలో బాత్‌రూమ్ క్లీనింగ్ కెమికల్స్ – ఎన్డీడీబీ రిపోర్టుతో చంద్రబాబు సంచలనం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యి అత్యంత నాసిరకమైనదని, అందులో బాత్‌రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ ఉన్నట్లు ఎన్డీడీబీ (NDDB) నివేదికలో తేలిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రసాయనాలు కలిపిన అపరిశుభ్రమైన నెయ్యిని వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన విమర్శించారు. తాను చేస్తున్న ఈ వ్యాఖ్యలు గాలిలో చేస్తున్నవి కావని, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ ఇచ్చిన అధికారిక నివేదిక ఆధారంగానే ఈ నిజాలను ప్రజల ముందుకు ఉంచుతున్నానని ఆయన స్పష్టం చేశారు.

కేవలం తిరుమల మాత్రమే కాకుండా, శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రసాదాల తయారీలోనూ వైసీపీ పాలనలో సుమారు మూడు లక్షల కేజీలకు పైగా కల్తీ నెయ్యిని వాడినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నింటినీ అపవిత్రం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ విషయంలో సిట్ (SIT) క్లీన్ చిట్ ఇచ్చిందన్న వార్తలను ఆయన కొట్టిపారేస్తూ, కల్తీ జరిగిందని సిట్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొందని, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ విషయాన్ని గతంలో అంగీకరించారని గుర్తు చేశారు.

దోషులు ఎంతటి వారైనా శిక్ష అనుభవిస్తారని, దేవుడితో పెట్టుకున్న మహా పాపం ఊరికే పోదని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక ప్రసాదాల నాణ్యతను మెరుగుపరిచామని, గతంలోని లడ్డూకు ఇప్పటి లడ్డూకు భక్తులే వ్యత్యాసం గమనించవచ్చని తెలిపారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ గుంటూరు పర్యటనపై స్పందిస్తూ, ప్రజా సమస్యల కోసం కాకుండా కేవలం రాజకీయ బలప్రదర్శన కోసమే జగన్ ఇలాంటి యాత్రలు చేస్తున్నారని, ప్రజలకు ఇబ్బంది కలిగించే రాజకీయాలను సహించబోమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *