తేది:06-02-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైద్రాబాద్: లకడికపూల్, రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, కేతిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురైన యువ న్యాయవాది స్వప్న కేసులో సమగ్ర విచారణ జరిపించి నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరుతూ వై. కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల కోర్టు న్యాయవాదులు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాల గురించి డీజీపీకి క్లుప్తంగా వివరించారు. అడ్వకేట్ స్వప్న దారుణ హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటు, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీతో చర్చించారు.
గతంలో ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా వినతిపత్రం అందజేశామని వై. కొండల్ రెడ్డి డీజీపీకి తెలిపారు.డీజీపీ శివధర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, పరిపూర్ణ ఎంక్వయిరీ చేపట్టి నిందితులకు తప్పకుండా కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల భద్రత కోసం తక్షణమే అడ్వకేట్ రక్షణ చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నపించాల్సిందిగా వై. కొండల్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గతంలో న్యాయవాదులపై జరిగిన దాడుల వివరాలను కూడా అధికారులకు తెలియజేశారు.
ఈ ఫిర్యాదుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వై. కొండల్ రెడ్డి, చేవెళ్ల కోర్టు న్యాయవాదులు సందీప్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, వినీత్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కుమార్, వి.ఐ.పి హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు మున్నా, మల్లిక తదితరులు పాల్గొన్నారు.