తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కోలుకుంటోన్నారు. ఇంట్లో జారిపడటం వల్ల ఆయన తుంటి ఎముక చిట్లింది. దీనికి శస్త్ర చికిత్స అవసరమైంది. యశోద ఆసుపత్రి డాక్టర్లు ఆయనకు చికిత్స నిర్వహించారు.
కేసీఆర్ ఆరోగ్యం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు నాయకులు కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. వేగంగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. భారత్ రాష్ట్ర సమితి నాయకులు చాలాచోట్ల ప్రత్యేక పూజలూ చేస్తోన్నారు.
ఈ పరిస్థితుల్లో త్రిదండి చినజీయర్ స్వామివారు కేసీఆర్‌ను పరామర్శించారు. రాత్రి 7:30 గంటల సమయంలో ఆయన యశోద ఆసుపత్రికి వెళ్లారు. తొలుత మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అనంతరం కేటీఆర్‌తో కలిసి కేసీఆర్ వద్దకు వెళ్లారు. ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు, కొద్దిమంది చిన జీయర్ అనుచరులు ఆ సమయంలో వారి వెంట ఉన్నారు. సుమారు 20 నిమిషాల పాటు వారు కేసీఆర్ చికిత్స పొందుతున్న గదిలో గడిపారు. బయటికి వచ్చిన తరువాత డాక్టర్లు చినజీయర్‌ను కలిశారు. కేసీఆర్‌కు అందుతున్న వైద్య వివరాలను వివరించారు.
తుంటి ఎముక రీప్లేస్ చేశామని, ఇప్పుడిప్పుడే వాకర్ సహాయంతో నడవగలుగుతున్నారని వివరించారు. కొద్దిరోజుల విశ్రాంతి తరువాత మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటారని, ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమౌతుందని చెప్పారు. ఇంతకుముందు కేసీఆర్ హెల్త్ బులెటిన్‌ను డాక్టర్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.