తేది:3-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు, ఎన్నికల నిర్వహణ భద్రతపై రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి, ఐపీఎస్. గారి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, అదనపు పోలీస్ బలగాల మోహరింపు, రౌడీషీటర్లు, చరిత్రాత్మక నేరస్తులపై ప్రత్యేక నిఘా, అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని డీజీపీ స్పష్టంగా ఆదేశించారు.
పోలింగ్ రోజున ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. అక్రమ డబ్బు పంపిణీ, మద్యం తరలింపు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమీక్ష సమావేశంలో మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్. గారి నేతృత్వంలో మెదక్ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని, జిల్లాలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బలగాల మోహరింపు, చెక్‌పోస్టుల ఏర్పాటు, నిఘా చర్యలపై డీజీపీకి వివరించారు.
మున్సిపాలిటీ ఎన్నికలు శాంతియుతంగా, న్యాయసమ్మతంగా జరగేందుకు మెదక్ జిల్లా పోలీసులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు.