ఉపాధి హామీ చట్టాన్ని ఖూనీ చేస్తున్నారు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైఎస్ షర్మిల ధ్వజం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో నిర్వహించిన ‘ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర’లో భాగంగా ఆమె ప్రసంగిస్తూ, పేదల పొట్ట కొట్టేలా కేంద్రం కొత్తగా ‘గ్రామ్ జీ’ చట్టాన్ని తెస్తోందని ఆరోపించారు. ఈ చట్టం వల్ల గ్రామాల నిర్ణయాధికారం తగ్గిపోయి, ఢిల్లీ నుంచే పనులను నిర్ణయించే పరిస్థితి వస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ పథకాన్ని కార్మికుల సరఫరా కోసం వాడుతూ, కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని షర్మిల విమర్శించారు. గతంలో ఈ పథకానికి 100 శాతం నిధులు కేంద్రమే ఇచ్చేదని, కానీ ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిధులను కేటాయించలేక పోతే పథకం ఆగిపోయే ప్రమాదం ఉందని, ఇది పేదలకు పెద్ద దెబ్బ అని ఆమె హెచ్చరించారు.

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ విషయంలో కేంద్రానికి మద్దతు ఇవ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉపాధి హామీ పథకం దేశానికే ఆదర్శంగా అమలు జరిగిందని, ఇప్పుడు కూలీలకు కనీసం తాగునీరు కూడా అందించలేని స్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడానికి, ‘గ్రామ్ జీ’ చట్టాన్ని రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని షర్మిల స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *