మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్ టౌన్‌లో అదనపు ఎస్పీ మహేందర్ ఆకస్మిక తనిఖీలు.

తేది:02-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ టౌన్ పరిధిలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసే దిశగా మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న వెల్కమ్ బోర్డు చెక్‌పోస్ట్‌ను పరిశీలించి, అక్కడ చేపట్టిన వాహనాల తనిఖీలు, భద్రతా చర్యల అమలును సమీక్షించారు.
అదేవిధంగా పట్టణంలోని పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించి, బందోబస్తు ఏర్పాట్లు, పోలీస్ సిబ్బంది నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు, చెక్‌పోస్టుల పనితీరుపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని ఆదేశించారు.
ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. పోలింగ్ రోజున ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ తనిఖీల్లో డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ టౌన్ సీఐ మహేష్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *