తేది:02-02-2026 హన్మకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: వరంగల్ లోని కాకతీయుల కాలంనాటి చారిత్రక కట్టడాల సంరక్షణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు చేపట్టాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య డిమాండ్ చేశారు. ప్రధానంగా వరంగల్ జిల్లాలోని చారిత్రక కట్టడాలను నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్విటీస్ (NMMA) లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అభివృద్ధి చేస్తున్నారా గత మూడేళ్లుగా వాటికి కేటాయించిన నిధులు ఎంత ఆక్రమణలు, నిర్మాణ నష్టం నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి అనే అంశాలపై లోక్‌సభలో సంస్కృతి శాఖ మంత్రిని వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య వివరణ కోరారు.దీనికి సమాధానంగా కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పురావస్తు శాఖ (ASI) ఆధ్వర్యంలో మొత్తం ఎనిమిది కేంద్ర పరిరక్షిత స్మారక కట్టడాలు ఉన్నాయని, వాటిలో వరంగల్ లోని వెయ్యి స్తంభాల ఆలయం, వరంగల్ కోట కూడా ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో స్మారక కట్టడాల సంరక్షణకు 2022–23లో రూ.15.50 కోట్లు,2023–24లో రూ.14.38 కోట్లు,
2024–25లోరూ.6.80 కోట్లు కేటాయించగా రూ.6.77 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. హృదయ్ (HRIDAY) పథకం కింద వరంగల్‌ను వారసత్వ నగరంగా అభివృద్ధి చేయగా,2018లో వెయ్యి స్తంభాల ఆలయం వద్ద టైల్ పార్కింగ్, లైటింగ్ సదుపాయాలు కల్పించారని,.2022లో వరంగల్ కోట ఉత్తర ద్వారం, కుష్ మహల్, స్వయంభూ ఆలయ సముదాయం, కీర్తి తోరణం వద్ద ఫసాడ్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అయితే, వరంగల్ లోని స్మారక కట్టడాల కోసం NMMA కింద ప్రత్యేక పథకాలు ఏవీ ప్రతిపాదించలేదని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమాధానంపై స్పందించిన వరంగల్ పార్లమెంట్ ఎంపీ డా. కడియం కావ్య ప్రస్తుతం జరుగుతున్న నిర్వహణ పనులను స్వాగతిస్తూనే, వరంగల్ స్మారక కట్టడాల కోసం ప్రత్యేక కేంద్ర పథకాలు లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కాకతీయుల కాలంనాటి అమూల్య వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు కాపాడేందుకు, వరంగల్ పర్యాటకాభివృద్ధికి దోహదపడేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని ఎంపీ కోరారు.