తేది:02-02-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, బుగ్గారం మండల రిపోర్టర్ ఎల్.వెంకటేశ్వర్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం శ్రీ ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మ ల జాతర – రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తండోప తండాలుగా భక్త జనం వివిధ జిల్లాల నుండి, అంతర్ రాష్ట్రాల నుండి వేలాదిగా తరలి వచ్చారు. ఆలయ కమిటి చైర్మన్ మసర్తి నర్సయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతరకు భారీగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. దావతోళ్ల విన్యాసాలు, ఒగ్గు కళాకారులు, డప్పు కళాకారులు నిర్వహించిన నృత్యాలు, కళాప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటి చైర్మన్ మసర్తి నర్సయ్య తనయుడు నరేష్ దంపతులు శ్రీ ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మ లకు ప్రత్యేకంగా వండిన బోనాలను ఊరేగింపుగా తీసుకు వెళ్ళి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించారు. దావతోళ్లు రంగు – రంగుల పిండితో వేసిన ముగ్గులు (పట్టు ), అన్నంతో ఏర్పాటు చేసిన దిష్టి కుంభం, ప్రకృతి పరమైన పూలతో నిర్వహించిన రథం యొక్క అలంకరణ భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతరకు విచ్చేసిన భక్త జనం, ప్రత్యేకంగా సుదూర ప్రాంతాల నుండి పోచమ్మ తల్లుల జాతర కోసం మాత్రమే తరలి వచ్చిన భక్త జనం అమ్మవార్లను దర్శించుకొని వారి – వారి మొక్కలు తీర్చుకున్నారు. కట్న కానుకలు సమర్పించి వారి భక్తిని చాటు కున్నారు.
ధర్మపురి సి.ఐ. ఎ. రామ్ నరసింహా రెడ్డి ఆదేశాలతో బుగ్గారం ఎస్సై జి. సతీష్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బలగాలు, పోలీస్ సిబ్బంది తగిన చర్యలు తీసుకొని బందోబస్తు నిర్వహించారు. భక్తుల వాహనాలను ప్రత్యేక స్థలాలలో పార్కింగ్ చేయించి ట్రాపిక్ ఇబ్బందులను నియత్రించారు. హమాలి సంఘం వారు, ఆలయాల కమిటి సభ్యులు, కార్యవర్గం ప్రత్యేక కృషి సలిపినారు. ఉచిత సేవలను అందజేసి రుచి – శుచి కరమైన వంటకాలు చేసి కూరగాయల భోజనాలతో అన్నదానం చాలా గొప్పగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నక్క రాజవ్వ – రాజయ్య, ఉప సర్పంచ్ జంగ లావణ్య – శ్రీనివాస్ లతో పాటు పాలక వర్గం వార్డ్ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, కాంగ్రెస్, టిడిపి, డీఎస్పీ మండల పార్టీల అధ్యక్షులు వేముల సుభాష్, పెద్దనవేని రాగన్న, దూడ పోచ రాజయ్య, మాజీ సర్పంచ్ లు మసర్తి రాజారెడ్డి, లక్ష్మి, మూల సుమలత – శ్రీనివాస్, నాయకులు శంకర్, రాజన్న, సత్తన్న, మల్లయ్యా, మల్లేశం, పోచమల్లు తదితరులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించు కున్నారు. భక్తులు, మహిళలు స్వయంగా అమ్మవార్ల రథాన్ని లాగి వారి భక్తిని చాటుకున్నారు.
ధర్మపురి సి.ఐ. ఎ. రామ్ నరసింహా రెడ్డి ప్రత్యేకంగా ఇట్టి జాతరకు హాజరై పర్యవేక్షించారు. పోలీస్ సిబ్బంది తో కలిసి భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నివారించారు.