వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్, తన పనితీరు కంటే తాను కట్టుకున్న చీర గురించి చర్చించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒకవేళ పురుషుడు ఆర్థిక మంత్రిగా ఉంటే, ఆయన ధరించిన దుస్తుల గురించి ఇలాగే మాట్లాడుకునేవారా?” అని ఆమె ప్రశ్నించారు. ఇది మహిళా నేతల పట్ల సమాజంలో ఉన్న లింగ వివక్షకు నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు. వృత్తిపరంగా మహిళలకు అందే గౌరవం వారి దుస్తులపై కాకుండా, వారు చేసే పనిపై ఆధారపడి ఉండాలని ఆమె సూచించారు.
ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగం కోసం ఆమె తమిళనాడుకు చెందిన చేనేత కాంచీపురం పట్టుచీరను ధరించారు. సాంప్రదాయ పద్ధతిలో ‘బహీ ఖాతా’ తరహా ఎరుపు రంగు పౌచ్‌లో డిజిటల్ బడ్జెట్ టాబ్లెట్‌ను సభకు తీసుకువచ్చారు. అయితే ప్రతి ఏటా తాను ఏ చీర కట్టుకుంటాననే విషయంపై వస్తున్న ప్రశ్నలు తనపై ఒత్తిడి పెంచుతున్నాయని, ఇకపై తనకు నచ్చిన దుస్తులనే ధరిస్తానని ఆమె స్పష్టం చేశారు. మహిళా మంత్రులపై ఇలాంటి అనవసర చర్చలు ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రిగా తన వృత్తిపరమైన ప్రతిభను గుర్తించాలని, ప్రత్యేక రాయితీలు కాకుండా పురుషులతో సమానమైన గౌరవం ఇవ్వాలని ఆమె కోరారు. ఒక పురుషుడిని ఎలా గౌరవిస్తారో తనను కూడా అలాగే చూడాలని, అప్పుడే నిజమైన సమానత్వం సాధ్యమవుతుందని నిర్మలమ్మ పేర్కొన్నారు. బడ్జెట్ వంటి కీలక అంశాలను పక్కన పెట్టి వస్త్రధారణపై దృష్టి పెట్టడం సరైన సంస్కృతి కాదని ఆమె హితవు పలికారు.