బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఆధ్వర్యంలో జరుగుతున్న దాడుల వెనుక భారత్ హస్తం ఉందన్న పాకిస్తాన్ వాదనలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. తమ దేశంలో తలెత్తిన అంతర్గత సమస్యలను, పాలనా వైఫల్యాలను దారి మళ్లించేందుకే పాక్ ఇలాంటి హాస్యాస్పదమైన ఆరోపణలు చేస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్‌పై నిందలు వేయడం పాకిస్తాన్‌కు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.
దశాబ్దాలుగా బలూచిస్తాన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందని భారత్ ఎత్తిచూపింది. ఆ ప్రాంతంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, అణచివేత చర్యలే ప్రస్తుత హింసకు ప్రధాన కారణమని పేర్కొంది. వేర్పాటువాదులను అడ్డుకోవడంలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి భారత్‌ను బలిపశువును చేయొద్దని, ముందుగా బలోచ్ ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడంపై దృష్టి సారించాలని భారత్ హితవు పలికిింది.
గత రెండు రోజులుగా బలూచిస్తాన్‌లో ‘ఆపరేషన్ హెరోఫ్’ పేరుతో సాగుతున్న ఈ దాడుల్లో 145 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ తమ ప్రాంతం పేదరికంలోనే ఉండిపోతోందని, పాక్ ప్రభుత్వం తమను దోచుకుంటోందని బలోచ్ వేర్పాటువాదులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు పాక్ సైనిక స్థావరాలు, ప్రభుత్వ భవనాలపై భీకర దాడులకు తెగబడ్డారు. ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనగా, అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.