జోగి రమేష్ ఇంటిపై దాడి కేసు: 11 మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్.. స్టేషన్ బెయిల్‌పై వైసీపీ ఆగ్రహం!

మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి పోలీసులు మొత్తం 40 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్నట్లు గుర్తించిన 11 మందిని సోమవారం ఉదయం అరెస్టు చేశారు. అయితే, వీరికి వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పోలీసులు నిందితులకు అనుకూలమైన సెక్షన్లు నమోదు చేయడం వల్లే వారికి త్వరగా బెయిల్ లభించిందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా, మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని జోగి రమేష్ ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే తన ఇంటిపై పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, దీనిపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఒకవైపు తనపై దాడులు చేయిస్తూనే, మరోవైపు తన మీద తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఇబ్రహీంపట్నంలో పోలీసులు భారీగా మోహరించారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నాయి. జోగి రమేష్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఘర్షణ వాతావరణం ఏర్పడిందని, ఆయనను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో అలజడులకు వైసీపీ కుట్ర చేస్తోందని, కార్యకర్తలు ఎవరూ ఆ ఉచ్చులో పడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. చట్టాన్ని గౌరవించాలని పార్టీ నేతలకు టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *