రోడ్డు ప్రమాద బాధితుడి ఇంటి వద్దే కేసు నమోదు… ప్రజల మనసు గెలుచుకున్న కౌడిపల్లి పోలీసులు FIR ఎట్ డోర్ స్టెప్’తో భరోసా ఇచ్చిన ఎస్సై అమర్.

తేది:1-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: కౌడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మానవీయ పోలీసింగ్‌కు మరో మంచి ఉదాహరణ కనిపించింది. కౌడిపల్లి మండలం వడ్డెర కాలనీకి చెందిన వర్షిత్ అనే బాలుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఘటనపై సమాచారం అందగానే, ఎలాంటి ఆలస్యం లేకుండా కౌడిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీ అమర్ గారు స్వయంగా బాధితుడి నివాసానికి చేరుకున్నారు.
బాలుడు చికిత్స పొందుతున్న పరిస్థితిని గమనించి, కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ వారి నుండి ఫిర్యాదును స్వీకరించారు. పోలీస్ స్టేషన్‌కు రావడం కష్టంగా ఉన్న పరిస్థితిని పరిగణలోకి తీసుకుని, అక్కడికక్కడే కేసు నమోదు చేసి FIR ప్రతిని బాధిత కుటుంబానికి అందజేయడం విశేషం.
“FIR ఎట్ డోర్ స్టెప్” కార్యక్రమం ద్వారా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న బాధితులకు న్యాయం మరింత సులభంగా అందుతుందని ఎస్సై అమర్ గారు తెలిపారు. అవసరమైన సందర్భాల్లో పోలీసులు నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి కేసులు నమోదు చేసి, చట్టపరమైన సహాయం వెంటనే అందించే విధంగా ఈ కార్యక్రమం పనిచేస్తుందన్నారు.
ఈ చర్య వల్ల పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని, పోలీస్–ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం అవుతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. మానవీయ దృక్పథంతో, బాధితుల పక్షాన నిలుస్తూ సేవలందిస్తున్న కౌడిపల్లి పోలీసుల చర్య ప్రశంసనీయం అని గ్రామస్తులు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *