AI సలహాతో ప్రాణాల మీదికి.. హెచ్‌ఐవీ మందులు వాడి వ్యక్తికి తీవ్ర అనారోగ్యం!

నేటి టెక్నాలజీ యుగంలో సమాచారం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌లపై ఆధారపడటం పెరిగిపోయింది. అయితే, దీనిని గుడ్డిగా నమ్మి వైద్య సలహాలు పాటిస్తే ఎంతటి ప్రమాదమో ఢిల్లీలో జరిగిన ఒక ఘటన నిరూపించింది. డాక్టర్‌ను సంప్రదించకుండా కేవలం ఏఐ చాట్‌బాట్ సూచన మేరకు హెచ్‌ఐవీ నిరోధక మందులు (PrEP/PEP) వాడిన 45 ఏళ్ల వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఎలాంటి క్లినికల్ టెస్టులు లేకుండా, కేవలం ఏఐ ఇచ్చిన మెడికల్ సలహాతో మందులు కొని వాడటంతో అతనికి ప్రాణాంతకమైన ‘స్టీవెన్స్ జాన్సన్ సిండ్రోమ్’ (Stevens-Johnson Syndrome) సోకింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.

స్టీవెన్స్ జాన్సన్ సిండ్రోమ్ అనేది మందుల దుష్ప్రభావం (Reaction) వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి. ఇది చర్మం, కళ్లు, నోరు వంటి భాగాలపై పొక్కులు మరియు దద్దుర్లు కలిగించడమే కాకుండా శరీర అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బాధితుడు వాడిన PrEP (Pre-Exposure Prophylaxis) మందులు వాస్తవానికి హెచ్‌ఐవీ వైరస్ సోకే ప్రమాదం ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఈ మందులు వేసుకునే ముందు హెచ్‌ఐవీ పరీక్ష తప్పనిసరి. కానీ ఏఐకి వ్యక్తిగత మెడికల్ హిస్టరీ తెలియకపోవడం, శారీరక పరీక్షలు చేయలేకపోవడం వల్ల అది ఇచ్చిన సమాచారం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది.

ఈ ఘటనపై వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏఐ అనేది కేవలం అవగాహన కోసం లేదా ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే వాడాలని, చికిత్స లేదా మందుల విషయంలో ఖచ్చితంగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఇంటర్నెట్‌లో దొరికే సమాచారం లేదా ఏఐ ఇచ్చే సలహాలు ఎప్పటికీ డాక్టర్లకు ప్రత్యామ్నాయం కావు. గూగుల్ లేదా యూట్యూబ్ చూసి బరువు తగ్గడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి. కాబట్టి వైద్య పరీక్షలు లేకుండా సొంతంగా మందులు వాడటం ప్రాణాంతకమని గ్రహించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *