ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. ఇటీవల భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అందుకున్న సందర్భంగా డాక్టర్ నోరిని చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించి, సాదరంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
ఈ భేటీకి సంబంధించిన వివరాలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. డాక్టర్ నోరి దత్తాత్రేయుడి అంకితభావాన్ని కొనియాడారు. “అధునాతన క్యాన్సర్ చికిత్సలో అసాధారణ సేవలు అందించిన డాక్టర్ నోరి గారికి ఆతిథ్యం ఇవ్వడం నా గౌరవంగా భావిస్తున్నాను. ఆయన సేవా ప్రయాణం, నిజాయతీ తరతరాలకు నిజమైన స్ఫూర్తినిస్తాయి” అని చిరంజీవి పేర్కొన్నారు.
వైద్య రంగంలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన తెలుగు వ్యక్తి డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కాగా, సినిమా మరియు సేవా రంగాల్లో దిగ్గజమైన చిరంజీవి ఆయనను గౌరవించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.