తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ భారీ స్కామ్‌కు పునాది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పడిందని, ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల మాట్లాడుతూ.. నెయ్యి నాణ్యత ప్రమాణాలను ఉద్దేశపూర్వకంగా సడలించి, అనర్హమైన సంస్థలకు టెండర్లు కట్టబెట్టారని విమర్శించారు.
2022లోనే మైసూర్ లోని CFTRI (Central Food Technological Research Institute) నిర్వహించిన పరీక్షల్లో నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నట్లు నివేదిక వచ్చినప్పటికీ, అప్పటి అధికారులు ఆ విషయాన్ని తొక్కిపెట్టారని పయ్యావుల ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమూనాలను NDDB (National Dairy Development Board) కు పంపగా, నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కల్తీ నెయ్యి సరఫరా వెనుక కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, కీలక వ్యక్తుల ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లినట్లు సిట్ (SIT) దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని వివరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోందని, కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టబోమని పయ్యావుల హెచ్చరించారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, తిరుమల ప్రసాదం నాణ్యతపై భక్తులకు పూర్తి నమ్మకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని, మరిన్ని కీలక విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.