మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం!

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత, దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం జరిగిన ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలందరూ ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణం చేయించారు. దీనితో మహారాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ రికార్డు సృష్టించారు. అజిత్ పవార్ అకాల మరణం తర్వాత పార్టీపై పట్టు కోల్పోకుండా ఉండాలని, ఆయన రాజకీయ వారసురాలిగా సునేత్రాను ఎన్సీపీ వర్గం రంగంలోకి దించింది.

ఇటీవల బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోకముందే, రాజకీయ అనిశ్చితిని నివారించేందుకు ఎన్సీపీ సీనియర్ నేతలు చర్చలు జరిపారు. పార్టీ సీనియర్ నేత ఛగన్ భుజబల్ ప్రతిపాదన మేరకు, సునేత్రా పవార్ పేరును ఎమ్మెల్యేలు ఖరారు చేశారు. ఈ నియామకానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన ఆమోదాన్ని తెలపగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సునేత్రా పవార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. సునేత్రా నియామకంతో అజిత్ పవార్ వర్గాన్ని తిరిగి శరద్ పవార్ నేతృత్వంలోని మాతృ సంస్థలో విలీనం చేసే ప్రక్రియపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

సునేత్రా పవార్ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, ఆమె 2024 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి తన వదిన సుప్రియా సూలేపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎన్సీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అజిత్ పవార్ మరణంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసేందుకు ఆమె నేరుగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు. మరోవైపు, అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్‌ను రాజ్యసభకు పంపాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *