మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రతిష్టను దెబ్బతీసేలా జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన రహస్య పత్రాలు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో కలకలం రేపుతున్నాయి. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం, 2013లో ఎప్స్టీన్ తన డ్రాఫ్ట్ ఈమెయిల్స్‌లో బిల్ గేట్స్‌కు రష్యన్ యువతులతో ఉన్న సంబంధాల వల్ల లైంగిక సంక్రమణ వ్యాధి (STD) సోకిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన భార్య మిలిండాకు తెలియకుండా దాచి ఉంచేందుకు, ఆమెకు రహస్యంగా ఇవ్వడం కోసం తన వద్ద యాంటీబయోటిక్స్ అడిగారని ఎప్స్టీన్ ఆ మెయిల్స్‌లో ఆరోపించారు.
అయితే, ఈ ఆరోపణలను బిల్ గేట్స్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఎప్స్టీన్ ఒక శిక్ష అనుభవించిన నేరస్థుడని, గేట్స్ తనతో సంబంధాలు తెంచుకున్నందుకు కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇటువంటి కట్టుకథలు అల్లారని వారు స్పష్టం చేశారు. కేవలం డ్రాఫ్ట్ మెయిల్స్‌లో ఉన్న అంశాలను నిజాలుగా పరిగణించలేమని, వీటిని ధృవీకరించే బలమైన ఆధారాలు లేవని న్యాయశాఖ కూడా పేర్కొంది. గతంలో కూడా ఒక రష్యన్ బ్రిడ్జ్ ప్లేయర్‌తో ఉన్న సంబంధాన్ని అడ్డం పెట్టుకుని ఎప్స్టీన్ గేట్స్‌ను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించారనే వార్తలు వచ్చాయి.
ఈ వివాదం బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితంపై ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపింది. 2021లో బిల్ గేట్స్, మిలిండా విడాకులు తీసుకున్న సమయంలో.. ఎప్స్టీన్తో గేట్స్ సాన్నిహిత్యంపై మిలిండా అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. సెక్స్-ట్రాఫికింగ్ కేసులో అరెస్టయి 2019లో జైలులో మరణించిన ఎప్స్టీన్ చుట్టూ ఉన్న రహస్యాలు, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఈ ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇవి కేవలం ఆరోపణలే అయినప్పటికీ, ఒక దిగ్గజ పారిశ్రామికవేత్త పరువును ఇవి ప్రశ్నార్థకం చేస్తున్నాయి.