ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. వనదేవతలను దర్శించుకుని తిరుగు ప్రయాణమైన వేలాది మంది భక్తులు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రభుత్వం 4 వేల బస్సులు ఏర్పాటు చేశామని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో బస్సులు లేక వృద్ధులు, మహిళలు, చంటిబిడ్డల తల్లులు తీవ్రమైన ఎండలో అల్లాడిపోతున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం జాతర నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యాయని భక్తులు మండిపడుతున్నారు.
బస్సుల కోసం రాత్రంతా వేచి చూసినా ఫలితం లేకపోవడంతో భక్తుల సహనం కట్టలు తెంచుకుంది. అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహించిన కొందరు భక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అక్కడున్న కొన్ని ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులకు, రవాణా శాఖకు మధ్య సమన్వయం లోపించడమే ఈ అరాచక పరిస్థితికి కారణమని విమర్శలు వస్తున్నాయి. కేవలం ప్రచారానికే పరిమితమైన ప్రభుత్వం, భక్తుల కనీస అవసరాలను గాలికొదిలేసిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రవాణా సౌకర్యాల లేమితో పాటు, మేడారం నుంచి తాడ్వాయి వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గత 8 గంటలుగా వాహనాలు నిలిచిపోవడంతో అంబులెన్స్‌లు కూడా కదలలేని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో యంత్రాంగం చేతులెత్తేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి అదనపు బస్సులను పంపాలని, ట్రాఫిక్ చిక్కుముడిని విడదీసి భక్తులను సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని బాధితులు కోరుతున్నారు.