ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. గుంటూరులో ఈ వివాదం ముదిరి కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) కార్యకర్తలు, వైసీపీ శ్రేణుల మధ్య బాహాబాహీకి దారితీసింది. దీంతో గుంటూరులోని నవభారత నగర్లో ఉన్న అంబటి రాంబాబు నివాసం వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది.
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో గుంటూరులోని ఒక ఆలయంలో శుద్ధి పూజలు చేయడానికి వెళ్లిన సమయంలో ఈ గొడవ మొదలైంది. అక్కడ ఇరు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం పరస్పర దూషణల వరకు వెళ్లింది. ఆగ్రహం చెందిన కూటమి కార్యకర్తలు అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో అక్కడి కారును ధ్వంసం చేయడమే కాకుండా, అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టాల్సి వచ్చింది.
మరోవైపు, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి నేతలు, మంత్రులు ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని పట్టుబడుతున్నారు. దీనిపై స్పందించిన అంబటి రాంబాబు.. తాను చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించలేదని, కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేశానని క్లారిటీ ఇచ్చారు. అయితే, ఆ సమయంలో కొంతమంది తనపై దాడికి ప్రయత్నించిన ఫ్రస్ట్రేషన్లో కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశానని, అది తప్పేనని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కూటమి శ్రేణులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.