తేది:31-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా: ఎన్నికల కోడ్ ముగిసి సాధారణ పరిపాలన కొనసాగుతున్నా, ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో నిబంధనల ప్రకారం అభివృద్ధి పనుల శిలాఫలకాలపై వేసిన ముసుగులు నేటికీ తొలగించకపోవడం ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది.
గ్రామంలోని పలు కీలక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటు చేసిన శిలాఫలకంపై వేసిన ముసుగు ఇప్పటికీ అలాగే ఉండటం అలాగే ప్రభుత్వ పాఠశాల సమీపంలోని సర్వాయి పాపన్న విగ్రహం. మహాత్మ జ్యోతిరావు పూలేవద్ద ఉన్న శిలాఫలకంపై కూడా ముసుగు తొలగించలేదు. మెట్‌పల్లి రోడ్డు దుర్గమ్మ షెడ్ వద్ద, ప్రధాన రహదారి పక్కన ఉన్న శిలాఫలకాలపై వేసిన ముసుగులు కూడా నేటికీ తొలగలేదు.
ఎన్నికల సమయంలో కోడ్ పేరుతో కట్టుదిట్టంగా వ్యవహరించిన గ్రామస్థాయి అధికారులు, కోడ్ ముగిసిన అనంతరం శిలాఫలకాలపై వేసిన పేపర్లు, రంగులను తొలగించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎండ, వానలకు ఆ కాగితాలు శిలాఫలకాలకు అతుక్కుపోయి, వాటిపై ఉన్న అక్షరాలు, అభివృద్ధి పనుల వివరాలు, ప్రజాప్రతినిధుల పేర్లు ప్రజలకు కనిపించకుండా మారుతున్నాయి.
సాధారణంగా ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ముసుగులను తొలగించి శిలాఫలకాలను శుభ్రం చేయాల్సి ఉన్నా, నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక పంచాయతీ అధికారులు, మండల యంత్రాంగం స్పందించి అంబేద్కర్ విగ్రహానికి ఉన్న శిలాఫలకంతో పాటు గ్రామమంతా ఉన్న అన్ని శిలాఫలకాలపై ముసుగులను తొలగించి శుభ్రం చేయాలని డబ్బా గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.