విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లోని రెండు వర్గాల విలీనంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. చాలామంది ఎన్సీపీ విలీనమే అజిత్ పవార్ “చివరి కోరిక” అని చెబుతున్నారు.అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గం బీజేపీతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉంది. ఆయన మామ శరద్ పవార్, సుప్రియా సులే ఎన్‌సీపీ వర్గం ప్రతిపక్షంలో ఉంది. శరద్ పవార్ ఎన్సీపీ కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనతో కలిసి ఉంది.
పొత్తుతో పోటీ
రెండు వర్గాలకు విడిపోయిన ఎన్సీపీని మళ్లీ ఒకటిగా చేయాలని.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అజిత్ పవార్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. తన పార్టీని ఎన్‌సీపీ (ఎస్పీ)లో విలీనం చేయాలని భావిస్తున్నట్లు కొందరు జర్నలిస్టులతో ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. జనవరి 15న పూణే, పింప్రి చించ్వాడ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. వచ్చే నెలలో జరిగే జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా రెండు వర్గాలు పొత్తును కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి.
అజిత్ పవార్ శాఖలు ఎన్సీపీకే
అజిత్ పవార్.. ఆర్థిక, ప్రణాళిక, ఎక్సైజ్ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. వీటితో పాటు క్రీడలు, యువజన సంక్షేమం, మైనారిటీ అభివృద్ధి శాఖలను కూడా అదనంగా నిర్వహించారు. అజిత్ పవార్ అకాల మరణం తర్వాత మహారాష్ట్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ జరగనుంది. అజిత్ పవార్ శాఖలను ఎన్సీపీ వర్గం నాయకులకు కేటాయించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం ఫడ్నవీస్‌కు లేఖ రాయనున్నట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి.
సీఎంను కలిసి ఎన్సీపీ(ఎస్పీ) నేతలు
ఎన్సీపీకి చెందిన ఛగన్ భుజ్‌బాల్, సునీల్ తత్కరే, ధనంజయ్ ముండే శుక్రవారం సీఎం ఫడ్నవీస్‌ను కలిశారు. అజిత్ పవార్ శాఖలకు సంబంధించి ఈ సమావేశం జరిగిందని ప్రఫుల్ పటేల్ చెప్పారు. ఎన్‌సీపీ వర్గాల విలీనంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయంపై అజిత్ పవార్ కుటుంబంతో కూడా చర్చిస్తామని పటేల్ అన్నారు. సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర చవాన్ గత రాత్రి వర్ష బంగ్లాలో సమావేశమయ్యారు.
డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్
శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకోవడానికి శనివారం ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ను శాసనసభ పక్ష నాయకురాలిగా ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకుంటే.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు రేపటి నుండే ప్రారంభమవుతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పదవికి కూడా సునేత్రా పవార్ పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై సునేత్రా పవార్‌తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోందని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు.
ఎన్సీపీ విలీనం అజిత్ పవార్ చివరి కోరిక
ఎన్సీపీ రెండు వర్గాలను విలీనం చేయడమే అజిత్ పవార్ చివరి కోరిక అని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. ఎన్సీపీ వర్గాలు త్వరగా విలీనం కావాలని అజిత్ పవార్ హృదయపూర్వకంగా కోరుకున్నారన్నారు. ఆయన మన మధ్య లేకపోవడంతో, విలీనం ముందుకు సాగాలి… అదే అజిత్ పవార్ చివరి కోరిక అని దేశ్ ముఖ్ అన్నారు.