ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలవుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్ధుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. ఈ సమయంలో విపక్ష టీడీపీ కూడా అభ్యర్ధుల ఎంపిక కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికల టికెట్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పటికే భారీగా పెరుగుతున్న టికెట్ల ఆశావహులకు చంద్రబాబు హింట్ ఇచ్చినట్లయింది.
ఏపీ ప్రజలకు టీడీపీ అవసరం ఎంతో ఉందని చంద్రబాబు ప్రకాశం జిల్లా నేతలతో వ్యాఖ్యానించారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని టికెట్ల కేటాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని నిర్మొహమాటంగా చంద్రబాబు నేతలకు తేల్చిచెప్పేశారు. నేతల పనితీరు బాగోలేకపోతే మాత్రం ఈసారి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. పనీతీరు బాగోలేని నేతలకు టికెట్ల కేటాయింపు ఉండదని వారికి ప్రత్యామ్నాయం చూపించి కూర్చోబెడతామన్నారు.
.
రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని నేతలతో చంద్రబాబు తెలిపారు. అయితే ఓట్ల తొలగింపుతో పాటు ఇతర అక్రమాలపై అధిష్టానం చూసుకుంటుదని కదా అని క్షేత్రస్ధాయిలో నేతలు అలసత్వంగా ఉండొద్దని చంద్రబాబు వారికి సూచించారు. ఎవరి స్ధాయిలో వారు పోరాటాలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఓట్ల అక్రమాల వ్యవహారాన్ని ఇన్ ఛార్జ్ లు బాధ్యతగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నా కొనసాగించిన కేసీఆర్ భారీగా నష్టపోయారు. దీంతో ఇప్పుడు ఏపీలోనూ వైసీపీ, టీడీపీ పనితీరు బాగోలేని, ప్రజాదరణ లేని ఎమ్మెల్యేలను పక్కనబెట్టేయాలనే ఆలోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ నేతలకు ఇచ్చిన హింట్ పై చర్చ జరుగుతోంది.