ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఈ సినిమా రెండో భాగం కోసం ప్రభాస్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ కొన్ని రోజులుగా సాలార్ 2 ఆగిపోయిందని..పూర్తిగా రీడిజైన్ చేస్తున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
ఒక ప్రముఖ మీడియా ఛానల్లో వచ్చిన కథనం ప్రకారం, ది రాజా సాబ్ బాక్సాఫీస్ ఫలితం తర్వాత సలార్ 2 ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. మూడు సంవత్సరాల క్రితం పనిచేసిన ఫార్ములా ఇప్పుడు పనిచేయకపోవచ్చు.. అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలిసి కథలో మార్పులు చేస్తున్నారని కూడా రాసారు. దీంతో సలార్ 2 ఆలస్యం అవుతుందేమోనని అభిమానులు భయపడ్డారు.
అయితే ఈ ఊహాగానాలన్నింటికీ తాజాగా చిత్రబృందం గట్టి సమాధానం ఇచ్చింది. శ్రుతిహాసన్ పుట్టినరోజు సందర్భంగా సలార్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ప్రభాస్..శ్రుతిహాసన్ కలిసి ఫోన్ చూస్తూ నవ్వుతూ కనిపించారు. ఆ ఫోటోకు ఇచ్చిన క్యాప్షన్ కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.
“సలార్ 2లో ఆద్యా దేవాకు ఏమి చూపిస్తోంది?” అంటూ పెట్టిన ఈ పోస్టు..సలార్ 2 ఖచ్చితంగా కొనసాగుతుందనే సంకేతంగా మారింది.
ఈ పోస్టు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిసింది. “చివరికి దేవా నవ్వాడు”, “ట్రైలర్ ఎప్పుడు?”, “వెరాడా – దేవా ఫైట్ చూడాలి” అంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభాస్.. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రల మధ్య వచ్చే ఘర్షణ ఈ భాగంలో మరింత బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్ 2023 డిసెంబర్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹650 కోట్ల వసూళ్లు సాధించింది. ఖాన్సార్ అనే కల్పిత ప్రపంచంలో స్నేహితులు శత్రువులుగా.. మారే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే కథను మరింత లోతుగా చూపించేదే సలార్ 2 అని చిత్రబృందం చెబుతోంది.
ఇదిలా ఉండగా ప్రభాస్ తదుపరి భారీ ప్రాజెక్ట్ స్పిరిట్..సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 2027 మార్చి 5న విడుదల కానుంది. మరోపక్క ప్రభాస్ హను రాఘవ పూడితో ఫౌజి సినిమా కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి కూడా ఈ హీరో డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సలార్ సినిమాని కూడా త్వరలోనే ప్రభాస్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారంట. మొత్తానికి, సలార్ 2 ఆగిపోయిందన్న వార్తలు కేవలం వదంతులేనని, ప్రభాస్ అభిమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు.