ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యేనని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.
‘చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ సచ్చుడో– తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్’ అని కేటీఆర్ కొనియాడారు. సాధించిన తెలంగాణను పదేళ్ల పాలనలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిపిన విజనరీ ఆయనేనని గుర్తు చేశారు. మిషన్ భగీరథ, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలతో అన్ని వర్గాలను చంటిబిడ్డల్లా సాకిన నాయకుడిపై ఇప్పుడు విచారణల పేరుతో వేధింపులకు దిగడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏడాది కాలంలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టిందని కేటీఆర్ విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే కేసీఆర్‌పై నోటీసుల అస్త్రాన్ని ప్రయోగించారని ఆరోపించారు. ‘ఇది విచారణ కాదు.. ప్రతీకారం. ఇది న్యాయం కాదు.. రాజకీయ దురుద్దేశం’ అని ఆయన స్పష్టం చేశారు.
నోటీసులతో లేదా బెదిరింపులతో తెలంగాణ చరిత్రను గానీ, కేసీఆర్ ముద్రను గానీ చెరిపేయలేరని కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే రాష్ట్ర ప్రజలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందని, ప్రజల పక్షాన నిలబడి ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. తెలంగాణ చరిత్ర విచారణలతో కాకుండా ప్రజల తీర్పుతోనే రాయబడుతుందని ఆయన తేల్చి చెప్పారు.