త్వరలో 770కు పైగా ఎయిర్ అంబులెన్సులు.. వింగ్స్ ఇండియాలో రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..!

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వింగ్స్ ఇండియా 2026 విజయవంతమైన సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. భారత విమానయాన రంగం భవిష్యత్తు, సాధించిన విజయాలు , రాబోయే లక్ష్యాలను వివరిస్తూ ఆయన తన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అకాల మరణానికి సంతాపం తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో విమానయాన రంగాన్ని తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా విమానాల తయారీపై దృష్టి సారించారు. ముఖ్యంగా పైలట్ శిక్షణకు అవసరమైన చిన్న తరహా విమానాలను భారత్‌లోనే తయారు చేస్తున్నామని వెల్లడించారు. రష్యాతో కలిసి SJ-100 వంటి అత్యాధునిక ఎయిర్‌క్రాఫ్ట్‌లను భారతీయ సాంకేతికతతో ఇక్కడే ఉత్పత్తి చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌బస్ విమానాల్లో భారత్ తయారు చేసిన విడిభాగాలు ఉండటం మన గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

 

గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా 90 కొత్త విమానాశ్రయాలను నిర్మించి అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు.‘రికార్డు స్థాయిలో కేవలం 30 నిమిషాల్లో 30 వేల మంది ప్రయాణికులు ప్రయాణించే స్థాయికి మన సామర్థ్యం చేరింది. రానున్న 15 ఏళ్లలో దేశానికి 30,000 మంది పైలట్ల అవసరం ఉంది. ఇప్పటికే 1620 కమర్షియల్ పైలట్ లైసెన్స్‌లను (CPL) మంజూరు చేయడం జరిగింది. విమానయాన రంగానికి తోడ్పడేలా బ్యాంకింగ్, ఐటీ, ఇన్సూరెన్స్ వంటి సేవలను ఒకే చోట (Single Window) అందుబాటులోకి తీసుకురానున్నారు. వైద్య సేవలను వేగవంతం చేసేందుకు 770కి పైగా ఎయిర్ అంబులెన్స్‌లను సిద్ధం’ చేస్తున్నారని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

 

విమానయాన రంగంలో మహిళల పాత్రను పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం దేశంలోని పైలట్లలో 15 శాతం మంది మహిళలే ఉన్నారు. ఇది ప్రపంచ సగటు కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, దీనిని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే మూడేళ్లలో సమగ్రమైన ‘విమానయాన ఎకో సిస్టం’ను నిర్మించబోతున్నామని.. తద్వారా భారత్ ప్రపంచ దేశాలకు తయారీ , ఎగుమతి కేంద్రంగా (Global Manufacturing Hub) మారుతుందని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *