తేది:29- 01- 2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
సంగారెడ్డి జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు వచ్చే రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ – గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలోబుధవారం సంగారెడ్డి లోని ఎస్ ఎస్ గార్డెన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్తో పాటు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు, వైద్య సలహాలు అందిస్తామని తెలిపారు. క్యాన్సర్‌పై ఉన్న భయాలు, అపోహలను తొలగించి మహిళల్లో ధైర్యం నింపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు .
గ్రామీణ మహిళలు తమ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కుటుంబం కోసం ఎక్కువగా శ్రద్ధ చూపుతారని, దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు . మహిళలకు ప్రధానంగా వచ్చే క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అని, వీటిని తొలి దశలోనే గుర్తిస్తే పూర్తిగా అరికట్టే అవకాశం ఉందన్నారు.
ఇందిరా మహిళా శక్తి, మహిళల కు ముందుగా అవగాహన కల్పించి వారి ద్వారా మహిళలందరికీ విస్తృత అవగాహన కల్పించడంతో క్యాన్సర్ ను అరికట్టవచ్చని అన్నారు.
మహిళలు తప్పనిసరిగా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఎత్తు, బరువు తక్కువ పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించాలని అన్నారు. ఎన్ ఆర్ .ఇ జి ఎస్ కార్యక్రమం ద్వారా న్యూట్రిషన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ: జిల్లాలో ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆరోగ్య మహిళ పీహెచ్సీలుగా గుర్తించామని తెలిపారు. అక్కడ మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో మొబైల్ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏసీ బస్సులతో కూడిన ఈ మొబైల్ క్యాంపుల్లో ఆధునిక వైద్య పరికరాలు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. మేజర్ జీపీలలో, మండల కేంద్రాలలో ఈ మొబైల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు మొబైల్ క్యాంపులను వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు సంకోచం విడిచిపెట్టి రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
జిల్లాలో ప్రతి గ్రామానికి ఈ అవగాహన కార్యక్రమం చేరేలా చర్యలు తీసుకోవాలని మహిళాసంఘాలకు సూచించారు. అవసరమైన మహిళలకు మెరుగైన వైద్య చికిత్స అందేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి , ఏఐజి హాస్పిటల్ అంకాలాజిస్ట్ ఆంకో–ప్లాస్టిక్ సర్జన్ మరియు యూసీ బ్రెస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి నర్రా , జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు , ఎస్ హెచ్ జి గ్రూప్ మహిళా సభ్యులు ,తదితరులు పాల్గొన్నారు.