మేడారం మహా జాతరలో సారలమ్మ తల్లి ఆగమనం అంగరంగవైభవంగా పూర్తయింది. కన్నెపల్లి నుండి సారలమ్మను ప్రధాన పూజారి కాక సారయ్య, రహస్య పూజల అనంతరం మేడారం గద్దెలపైకి తరలించారు. కన్నెపల్లి నుండి మూడున్నర కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి గద్దెలపైకి చేరుకున్నారు సారలమ్మ తల్లి.
నాలుగు రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరలో తొలిరోజు ముగ్గురు వనదేవతల ఆగమనం ప్రత్యేకమైంది. పూనుగొండ్ల నుండి 70 కిలో మీటర్లు కాలినడకన రెండు రోజుల పాటు ప్రయాణం చేసి మేడారం చేరుకున్నారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు. ఏటూరునాగారం కొండాయి నుండి 15 కిలో మీటర్లు ప్రయాణించి గద్దెలపైకి చేరుకున్నారు పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. పగిడిద్దరాజును పెనక బుచ్చిరామయ్య, గోవిందరాజును డబ్బగట్ల గోవర్దన్ గద్దెలపైకి తీసుకురాగా.. సారలమ్మను కాక సారయ్య మేడారం తీసుకొచ్చారు.
ప్రధాన దేవత సమ్మక్క కూతురు సారలమ్మ ఆగమనం ఎంతో ప్రత్యేకమైంది. కన్నెపల్లిలో కొలువైన సారలమ్మకు ఉదయం నుండి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాక వంశీయుల ఆడపడుచులు తెచ్చిన పవిత్ర జలంతో సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపుకుంకుమలతో అలంకరించారు. కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్ కుటుంబ సమేతంగా పసుపు, కుంకుమలతో మేడారం చేరుకుని సారలమ్మ గద్దెను ముగ్గులతో అలంకరించారు. మళ్ళీ తిరిగి కన్నెపల్లి వెళ్ళి సారలమ్మకు రహస్య పూజలు నిర్వహించారు పూజారులు. ఈ పూజల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. సాయంత్రం 7:30 నిమిషాలకు కన్నెపల్లి ఆలయం నుండి సారలమ్మ ఆగమనం ప్రారంభమైంది.
ఆదివాసీ నృత్యాలు, డప్పు చప్పుళ్ళ మధ్య సారలమ్మ ఆగమన ప్రక్రియ మొదలైంది. దారి పొడవునా భక్తుల నీరాజనాలు, శివసత్తుల పూనకాలు, సారలమ్మ నినాదాలతో మేడారం మురిసిపోయింది. సారాలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య సారలమ్మను తీసుకొస్తుండగా, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు సంరక్షకులుగా ఉన్నారు. హనుమాన్ జెండాతో సోలెం వెంకన్న ముందు నడవగా.. గొంది లక్ష్మయ్య జలకంతో, కాక రంజిత్ దూప దీపంతో కలిసి వచ్చారు. కాక కనకమ్మ, కాక భుజంగరావు, కాక లక్ష్మీబాయి బృందం సారలమ్మను మేడారం తీసుకొచ్చారు.
సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత అధికారులు ఆదివాసీలతో కలిసి నృత్యాలు చేశారు. వారితో మంత్రి సీతక్క సైతం కలిసి నృత్యం చేశారు. వెదురు కర్ర రూపంలో ఉన్న సారలమ్మను తీసుకొస్తుండగా భక్తులు తల్లిని తాకేందుకు ఎగబడ్డారు. పడిగే రూపంలో పూనుగొండ్ల నుండి బయల్దేరిన పగిడిద్దరాజు, కొండాయి నుండి బయల్దేరిన గోవిందరాజును గోవిందరావు పేట మండలం లక్ష్మీపురం వద్ద ఎదుర్కొని విడిదింట్లో బస చేశారు.
బుధవారం ఉదయం 11 గంటలకు లక్ష్మీపురం నుండి బయల్దేరి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకున్నారు పగిడిద్దరాజు, గోవిందరాజు. సమ్మక్క ఆలయంలో పూజల అనంతరం గద్దెల ప్రాంగణానికి పగిడిద్దరాజు గోవిందరాజు చేరుకున్నారు. సారలమ్మను జంపన్న వాగు మీదుగా మేడారం చేరుస్తుండగా భక్తుల పూనకాలతో తన్మయత్వానికి లోనయ్యారు. దారి పొడవునా అమ్మవారికి ఘన స్వాగతం పలుకుతూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు లక్షలాది ప్రజలు.
రాత్రి 10గంటల సమయానికి మేదరానికి చేరుకున్న సారలమ్మను మొదటగా సమ్మక్క ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్ధరాత్రి12:30 నిమిషాలకు గద్దెల ప్రాంతానికి తీసుకొచ్చారు. గోవిందరాజు, పగిడిద్దరాజుతో కలిసి గద్దెలపైకి చేరుకున్న సారలమ్మను ప్రధాన పూజారి సారయ్య ప్రతిష్టాపన చేశారు.