తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. బుధవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు దాదాపు 890 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అందులో 382 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి 258 మంది, బీజేపీ నుంచి 169 మంది అభ్యర్థులు ఉన్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి
అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ప్రచారానికి ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి నుంచి ప్రచారంలోకి దిగాలని ప్రధాన పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. ఫిబ్రవరి మూడు నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారంలోకి దిగునున్నారు. ఇదిలావుండగా బీజేపీ కూడా తమ సత్తా నిరూపించుకోవాలని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ హైకమాండ్ పెద్దలు రంగంలోకి దిగనున్నారు.
ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కొన్ని విషయాలు బయటపెట్టారు. 10 రోజుల్లో రెండు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒకటి ఉత్తర తెలంగాణ కాగా, మరొకటి దక్షిణ తెలంగాణలో భారీ సభలు నిర్వహిస్తామని చెప్పారు. హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇద్దరు ప్రచారానికి రానుండడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ప్రచారానికి అమిత్ షా-నితిన్ రాక, హైకమాండ్‌తో జనసేన మంతనాలు
ఇదిలావుండగా ఢిల్లీ వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీగా బిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులను ఆయన కలుస్తున్నారు. గత రాత్రి హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు ఏపీ, తెలంగాణ రాజకీయాల గురించి చర్చించుకున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సమాచారం.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం మొదలైంది. ఆ విషయమై షాతో జనసేన అధినేత పవన్ చర్చించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ కూటమి కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నట్లు తెలుస్తోంది. మరి కలిసి పోటీ చేస్తారా? లేకుంటే ఎవరికివారే పోటీ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
పవన్ తన పార్టీ వ్యూహాన్ని వివరించినట్లు సమాచారం. ఒకవేళ కలిసి పోటీ చేస్తే నేడు లేదా రేపు ప్రకటన రావచ్చని అంటున్నారు. దీనిపై జనసేన కేడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలాగే ఏపీకి సంబంధించి రాజకీయ అంశాలు కూడా ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.