ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం.. జనసేన కీలక నిర్ణయం..!

రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన పార్టీలో ఓ కుదుపు కుదిపేసింది. సదరు ఎమ్మెల్యేపై ఓ మహిళ చేసిన ఆరోపణల వ్యవహారం వేడెక్కింది. పరిస్థితి గమనించిన జనసేన హైకమాండ్ రంగంలోకి దిగేసింది. విచారణ కోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటివరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సదరు ఎమ్మెల్యేని ఆదేశించింది.

 

ఎమ్మెల్యే శ్రీధర్ అంశంలో జనసేన కీలక నిర్ణయం

 

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది జనసేన పార్టీ. ఆయనపై ఓ మహిళ ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించింది ఆ పార్టీ హైకమాండ్. అందులో శివశంకర్‌, రమాదేవి, వరుణ్‌ ఉన్నారు. వారం లోపు ఆ కమిటీ ముందు ఆయన హాజరై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వనున్నారు. వారంలోగా ఆ కమిటీ పార్టీకి నివేదిక ఇవ్వనుంది .

 

అంతేకాదు కమిటీ నివేదిక వెల్లడయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సదరు ఎమ్మెల్యేని ఆ పార్టీ ఆదేశించింది. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ నియోజకవర్గానికి చెందిన ఓమహిళ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు అందుకు సంబంధించి వీడియో విడుదలైంది.

 

వారం రోజుల్లో వివరణ.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా

 

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు ఎమ్మెల్యే మోసం చేశారని అందులో పేర్కొంది. అంతేకాదు కొన్ని ప్రైవేట్ వీడియోలు విడుదల చేసింది. ఈ వ్యవహారంపై బయటకు రాగానే ఎమ్మెల్యే శ్రీధర్ రియాక్ట్ అయ్యారు. కొంతమంది తనను టార్గెట్ చేశారని, అందులో భాగంగా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ మహిళ చేసిన ఆరోపణలపై న్యాయస్థానం ద్వారా బదులిస్తానన్నారు.

 

డీప్ ఫేక్ వీడియోలతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారిని వదిలేది లేదని తేల్చిచెప్పారు. అంతేకాదు తన కొడుకుపై సదరు మహిళ ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నట్లు శ్రీధర్ తల్లి ప్రమీల చెప్పారు. శ్రీధర్‌ను 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని కొత్త విషయాలు బయటపెట్టారు. ఆమె బెదిరింపులకు లొంగకపోవడం వల్లే ఈ విధంగా చేశారని ఆరోపించారు.

 

శ్రీధర్ ఎపిసోడ్‌పై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ రియాక్ట్ అయ్యారు. బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు. మహిళల గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆమె చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *