ఎమ్మెల్యే శ్రీధర్ కేసులో బిగ్ ట్విస్ట్..!

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుకున్న వివాదం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఎమ్మెల్యే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఏడాదిన్నర కాలంగా శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేశారని ఒక వివాహిత చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తనను ఐదుసార్లు అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ, అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఇతర ఆధారాలను ఇప్పటికే బహిర్గతం చేశారు. అయితే, ఈ కేసులో తాజాగా ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది. సదరు మహిళ ఎమ్మెల్యేను రూ. 25 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఆ ఆడియోలో ఉండటం చర్చనీయాంశమైంది.

 

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ తీవ్రంగా కొట్టిపారేశారు. ఇవి తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. కాగా, బాధితురాలు మాత్రం వెనక్కి తగ్గకుండా ఇప్పటికే రాష్ట్ర డిజిపి, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తన న్యాయవాదితో కలిసి అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో తనపై వైరల్ అవుతున్న రూ. 25 కోట్ల నగదు డిమాండ్ ఆడియో కాల్‌పై ఆమె మీడియా వేదికగా స్పష్టతనిచ్చారు. ఆ ఆడియో కాల్ పూర్తిగా ఎడిట్ చేయబడిందని, తన మాటలను సందర్భం లేకుండా కత్తిరించి తనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

 

తాను ఎప్పుడూ ఎమ్మెల్యేను డబ్బులు అడగలేదని, కేవలం తన జీవితాన్ని నాశనం చేసినందుకు న్యాయం చేయమని మాత్రమే కోరుతున్నానని బాధితురాలు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులే తనకు ఫోన్ చేసి, “సెటిల్‌మెంట్ చేసుకుందాం.. ఎంత కావాలి?” అని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని ఆమె పేర్కొన్నారు. ఆ క్రమంలో జరిగిన సంభాషణను వక్రీకరించి, తనను బ్లాక్ మెయిల్ చేసేందుకే ఈ కుట్రను సృష్టించారని ఆరోపించారు. తనకు రూ. 25 కోట్లు కాదు కదా, రూ. 100 కోట్లు ఇచ్చినా తన న్యాయ పోరాటం ఆగదని, తనకు జరిగిన అన్యాయానికి ఎమ్మెల్యేకు శిక్ష పడాల్సిందేనని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

 

తన వద్ద ఉన్న వీడియోలు, ఆడియోలు అన్నీ ఒరిజినల్ అని, కావాలంటే ఎమ్మెల్యే విడుదల చేసిన ఆడియోతో పాటు తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని ఆమె డిమాండ్ చేశారు. సాంకేతిక పరీక్షల్లో అసలు నిజాలు బయటపడతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం, దానికి ప్రతిగా నగదు డిమాండ్ ఆరోపణలు తెరపైకి రావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *