ట్రంప్‌కి అల్జీమర్స్? మతిమరుపు లేదంటూనే ఆ వ్యాధి పేరు మర్చిపోయిన అగ్రరాజ్య అధినేత!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానసిక ఆరోగ్యంపై కొన్నాళ్లుగా సాగుతున్న ప్రచారానికి, ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. తనకు మతిమరుపు (అల్జీమర్స్) ఉందన్న వార్తలను ఆయన కొట్టిపారేస్తూనే, ఇంటర్వ్యూలో ఆ వ్యాధి పేరును గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూయార్క్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను 40 ఏళ్ల క్రితం ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, ఇప్పుడూ అంతే ఫిట్‌గా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే, తన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ అల్జీమర్స్‌తో బాధపడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ పదం కోసం తడబడ్డారు.

తన తండ్రికి ఒక వ్యాధి ఉండేదని చెబుతూ.. “ఏమంటారు దాన్ని?” అని తన నుదుటిపై వేలు పెట్టి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్ వైపు చూశారు. ఆమె ‘అల్జీమర్స్’ అని గుర్తు చేయగా.. “అవును, మతిమరుపు లాంటిది. కానీ నాకు అది లేదు” అని ట్రంప్ బదులిచ్చారు. 1999లో తన తండ్రి 93 ఏళ్ల వయసులో ఇదే వ్యాధితో మరణించారని ఆయన గతంలోనూ పేర్కొన్నారు. 78 ఏళ్ల వయసులో ఉన్న ట్రంప్, తన వయసు రీత్యా వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. తాను రాత్రంతా పనిచేస్తానని, తన సిబ్బంది కంటే ఎక్కువ చురుకుగా ఉంటానని చెప్పుకుంటున్నారు.

అమెరికాలో సీనియర్ రాజకీయ నేతల వయసు, వారి మానసిక స్థితిపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. గతంలో జో బైడెన్ కూడా ఇలాంటి మతిమరుపు ఆరోపణలను ఎదుర్కొన్నారు. వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ మాత్రం ట్రంప్‌ను “సూపర్ హ్యూమన్ ప్రెసిడెంట్” అని అభివర్ణిస్తూ, ఆయన శారీరక, మానసిక ఆరోగ్యం పరిపూర్ణంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా, ఇంటర్వ్యూలో ఆయన తడబడిన వీడియో ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *