ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భీమవరంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్రం అరాచకానికి నిలయంగా మారిందని విమర్శించారు. ‘దోచుకో, పంచుకో, తినుకో’ అనే రీతిలో పాలన సాగుతోందని, సంక్రాంతి పండుగను కూడా జూదం, అశ్లీల నృత్యాలతో భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ అబద్ధాలేనని తేలిపోయిందని, ప్రజలను బాండ్ల పేరుతో వంచించారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియాలు రాజ్యమేలుతున్నాయని జగన్ ఆరోపించారు. మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి, బెల్ట్ షాపుల ద్వారా ప్రజల రక్తం తాగుతున్నారని మండిపడ్డారు. తమ హయాంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిన ఇసుకను, ఇప్పుడు ఫ్రీ అని చెప్పి అక్రమంగా తవ్వేస్తూ రెట్టింపు ధరకు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. అలాగే, కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు మితిమీరిపోయాయని.. అరవ శ్రీధర్ వంటి వారు మహిళా ఉద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడినా, ఇతర ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు.
వచ్చే ఏడాదిన్నరలో తాను మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తానని, సుమారు 150కి పైగా నియోజకవర్గాల్లో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని జగన్ ప్రకటించారు. “జగన్ 2.0″లో కార్యకర్తలకే ప్రథమ స్థానం ఉంటుందని, ప్రతి కార్యకర్త సంఘటితంగా ఉండి చంద్రబాబు ప్రభుత్వ అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కళ్లు తెరిచి మూసేలోగా మూడేళ్లు గడిచిపోతాయని, మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.