మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి వద్ద కూలిపోయిన ఘటనలో ‘రీడ్‌బ్యాక్’ (Readback) అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. విమానం ల్యాండ్ కావడానికి 12 నిమిషాల ముందే ఏటీసీ (ATC) తో సంబంధాలు తెగిపోయాయని, ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు పైలట్ నుంచి ‘రీడ్‌బ్యాక్’ రాలేదని కేంద్రం వెల్లడించింది. సరళంగా చెప్పాలంటే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ఇచ్చే కీలక సూచనలను పైలట్ తిరిగి పునరావృతం చేస్తూ సమాధానం చెప్పడాన్నే విమానయాన భాషలో ‘రీడ్‌బ్యాక్’ అంటారు.
విమానయాన నిబంధనల ప్రకారం.. రన్వేలోకి ప్రవేశించడం, ల్యాండింగ్ లేదా టేకాఫ్ చేయడం, విమానం వేగం, ఎత్తు మార్చుకోవడం వంటి కీలక సమయాల్లో ఏటీసీ ఇచ్చే సందేశాన్ని పైలట్ ఖచ్చితంగా తిరిగి వినిపించాలి. దీనివల్ల పైలట్ సూచనలను సరిగ్గా అర్థం చేసుకున్నారని ఏటీసీకి భరోసా కలుగుతుంది. అజిత్ పవార్ ప్రయాణించిన విమాన పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్, ఉదయం 8:34 గంటలకు ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు ఎటువంటి రీడ్‌బ్యాక్ ఇవ్వలేదు. అంతకుముందు ఆమె రన్‌వే సరిగ్గా కనిపించడం లేదని రిపోర్ట్ చేయగా, ఏటీసీ సూచనల తర్వాత ‘కనిపిస్తోంది’ అని చెప్పారు. కానీ ఆఖరి నిమిషంలో సమాధానం రాకపోవడం ప్రమాద తీవ్రతను సూచిస్తోంది.
ప్రమాద సమయంలో విజిబులిటీ (కనిపించే దూరం) సుమారు 3 కిలోమీటర్లు ఉందని, ఇది ల్యాండింగ్‌కు సాధారణమైనదేనని నిపుణులు చెబుతున్నారు. అయితే, పైలట్ నుంచి రీడ్‌బ్యాక్ రాకపోవడానికి కారణం ఆ సమయంలో కాక్‌పిట్‌లో సాంకేతిక లోపం తలెత్తిందా లేక పైలట్ ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ‘విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో’ (AAIB) ఈ దిశగా లోతైన విచారణ చేపట్టింది. విమానం వేగాన్ని తెలిపే రేడియో సిగ్నల్స్ కూడా అంతకుముందే ఆగిపోవడం ఈ మిస్టరీని మరింత పెంచుతోంది