సొంతగూటికి ఆరూరి రమేశ్: కడియం శ్రీహరిపై నిప్పులు చెరుగుతూ బీఆర్ఎస్‌లో చేరిక!

వరంగల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బుధవారం తిరిగి భారత్ రాష్ట్ర సమితి (BRS) లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన రమేశ్, తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమయ్యారు. చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లోడు మళ్ళీ ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, తనకు ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

పార్టీలో చేరిన అనంతరం ఆరూరి రమేశ్ మాట్లాడుతూ మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేకమంది నాయకులపై బురద జల్లి, వారు రాజకీయంగా ఎదగకుండా చేసిన వ్యక్తి కడియం అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన రేవంత్ రెడ్డితో ములాకత్ కుదుర్చుకుని, బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని విమర్శించారు. కడియం వంటి ‘పాపాత్ముడు’ పార్టీని వీడటంతోనే తాను తిరిగి వచ్చానని, ఆయన పెట్టిన ఇబ్బందుల వల్లే గతంలో తాను మనస్తాపంతో బయటకు వెళ్లాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఈ సందర్భంగా ఆరూరి రమేశ్‌కు మద్దతుగా మాట్లాడారు. కడియం శ్రీహరి వంటి మోసపూరిత వ్యక్తులకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఆవేదనతో రమేశ్ వెళ్ళిపోయారని, కానీ ఆయనకు ఎప్పుడూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై గౌరవం తగ్గలేదని అన్నారు. రమేశ్ రాకతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కేడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *