తేది:27-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవన్లో జనవరి 26న బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో జోనల్ స్థాయి కీలక సమావేశం నిర్వహించబడింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, సంస్థాగత బలోపేతం అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశానికి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. ఈశ్వర్, రాష్ట్ర జోనల్ కార్యదర్శి కుతాడి నర్సింలు, ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ దిశా నిర్దేశం చేశారు. అలాగే మెదక్ జిల్లా అధ్యక్షుడు నాగులూరి స్వామిదాస్, సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ప్రేమ్ కుమార్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఉమేష్ పాల్గొని, జిల్లాలో పార్టీ బలాన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు.
నాయకులు మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు బీఎస్పీ పార్టీ పూర్తి స్థాయిలో రాజకీయ, సంస్థాగత మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టంగా ప్రకటించారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, బహుజన వర్గాల హక్కుల పరిరక్షణే పార్టీ ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు మెదక్ బీఎస్పీ జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులకు అవసరమైన మార్గనిర్దేశం, పార్టీ మద్దతు, ఎన్నికల వ్యూహాలపై పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు మెదక్ బీఎస్పీ జిల్లా కార్యాలయం – సంప్రదింపు నంబర్: 9676949499 ద్వారా వివరాలు పొందవచ్చని స్పష్టం చేశారు.
అదేవిధంగా, ప్రతి మున్సిపాలిటీలో పార్టీ కమిటీల బలోపేతం, వార్డు స్థాయి కార్యకర్తల సమన్వయం, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలనే నిర్ణయాలు తీసుకున్నారు. యువత, మహిళలు రాజకీయాల్లో ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు జనార్ధన్ గౌడ్, మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు సారా రవి,మెదక్ అసెంబ్లీ ఇన్చార్జ్ ప్రభాకర్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. సమావేశం విజయవంతంగా ముగియడంతో, మెదక్ జిల్లాలో బీఎస్పీ రాజకీయ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.