బంగ్లాదేశ్‌లోని బాగర్‌హాట్ జైలులో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఎట్టకేలకు స్వేచ్ఛను పొందారు. భారత ప్రభుత్వం మరియు బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చలు సఫలం కావడంతో మంగళవారం (జనవరి 27) వీరి విడుదల ప్రక్రియ పూర్తయ్యింది. బంగ్లాదేశ్ హోం శాఖ డిప్యూటీ సెక్రటరీ స్వయంగా జైలుకు చేరుకుని మత్స్యకారులను విడుదల చేయగా, భారత హైకమిషన్ అధికారులు మరియు ఈస్ట్ కోస్ట్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
విడుదలైన 23 మంది మత్స్యకారుల్లో 9 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. ప్రస్తుతం వీరిని కట్టుదిట్టమైన భద్రత మధ్య మోంగ్లా పోర్టుకు తరలించారు. అక్కడ వారి ఫిషింగ్ బోట్లకు అవసరమైన చిన్నపాటి మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత, భారత్-బంగ్లాదేశ్ విదేశాంగ ఒప్పందం ప్రకారం జనవరి 29వ తేదీన అంతర్జాతీయ జలాల్లో ఇరు దేశాల కోస్ట్ గార్డ్ అధికారుల సమక్షంలో మత్స్యకారులను భారత అధికారులకు అధికారికంగా అప్పగించనున్నారు.
మోంగ్లా పోర్టుకు చేరుకున్న వెంటనే మత్స్యకారులు ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడి క్షేమ సమాచారాన్ని పంచుకున్నారు. దాదాపు 80 రోజులకు పైగా జైలులో గడిపిన వీరు, విముక్తి లభించడంతో కన్నీటిపర్యంతమయ్యారు. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో వీరంతా విశాఖపట్నం తీరానికి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు సురక్షితంగా విడుదల కావడం పట్ల ఉత్తరాంధ్రలోని వారి స్వగ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.